కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్లో, ఈ హోటల్ ఇప్పుడు ఉందో లేదో
నాకు తెలియదు. అప్పటి దాకా ఇంటి భోజనం,
అప్పుడప్పుడు
ఫ్రెండ్స్‌తో కలిసి వాళ్ళ మెస్‌లో కానీ,
హోటళ్ళో కానీ తినడమే
తప్ప, హోటళ్ళో తినడం నాకు అసలు అలవాటు
లేదు, ఇష్టం కూడా ఉండదు. జిల్లా పరిషత్‌లో, మా జెఇ
పాండురంగారావు గారు బదిలీ అయినప్పుడు కొలీగ్స్ అందరమూ కలిసి హోటళ్ళో పార్టీ
ఇచ్చాము. నేను చికెన్ సగం తిని వదిలేసాను. బయటకు వచ్చాకా, మా కొలీగ్ యాభై రూపాయలు బొక్క, తిననని చెపితే నీకు తెప్పించే వాడిని కాదు కదా అని తిట్టాడు. ఆ, యాభై రూపాయలా, ఆ విషయం ముందే చెప్పుంటే, కుక్కేసుకుందును
కదా అని తెగ భాధపడిపోయాను. అప్పటికి నాకు నాన్ వెజ్ అంతగా అలవాటు లేదు. ఎప్పుడన్నా
పావుకేజీ మాంసం వండితే, మా ఇద్దరక్కలు, నేను కలిసి దానిని రెండు పూటలు తినేవాళ్ళము. నేను పుట్టిన
దగ్గర నుండీ మా పేరెంట్స్ నాన్ వెజ్ తినడం మానివేసారు. (కొడుకులంటే అప్పుడే
భయపడేవారన్న మాట). దానితో మాకు నాన్ వెజ్ ఇష్టం ఉండేది కాదు.
భోజనం చేసి ఆఫీసుకు చేరాము. ఆఫీసులో సాయంత్రం దాకా గడిపి,
నేను బస్సు స్టాండ్ కి బయలుదేరాను. దారిలో
ఆగి ఇంకో సిగరెట్ పెట్టి (ఇప్పుడు అయితే డబ్బీ అంటున్నాను) కొన్నాను. అప్పుడు సాయంత్రం
5 .30 అయ్యింది. బస్సు 7 .30 కి. సరే అని
చెప్పి అక్కడే అందరిని చూస్తూ తిరుగుతున్నాను. అక్కడి భాష నాకు కొత్తగా వుంది. ఈ
లోపు ఒక లంబాడి గ్రూప్ ని చూసాను. వాళ్ళు అక్కడే గుండ్రం గా కూర్చుని
ఏడుస్తున్నారు. నేను ఎప్పుడో చిన్నప్పుడు విజయవాడ లో వుండగా లంబాడి వాళ్ళను చూసాను, మరల ఇప్పుడు చూడడమే. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో నాకు
అర్థం కాలేదు. ఎవరైనా పోయారేమో అనుకున్నాను. అక్కడ, ఒకరిని ఏమైంది
అని అడిగితే, ఆ ఏమి లేదు వాళ్ళల్లో ఎవరైనా వూరు వెళుతుంటే, వాళ్ళు అలాగే
ఏడుస్తారు అని చెప్పాడు. అలా అందరిని చూస్తూ
కాలక్షేపం చేస్తున్నాను. ఇంకా ఎన్ని సిగరెట్స్ ఉన్నాయా అని చూసాను.
ఆరు వున్నాయి. పరవాలేదు ఇంటికి వెళ్ళే లోపు కాల్చేయవచ్చు అనుకున్నాను. ఎందుకంటే
నేను సిగరెట్స్ మానేసానని మా నాన్న గారికి చెప్పాను.
అది కూడా చాలా విచిత్రంగా జరిగింది. నా
ఫ్రెండ్ ఒకడు విశాఖపట్నం నుండి కాకినాడ వచ్చాడు. వాడు, నేను మూడు నెలల తేడాతో వైజాగ్‌లో పక్క, పక్క ఇల్లల్లో
పుట్టాము. వాళ్ళ నాన్నగారు కూడా, పాలిటెక్నిక్‌లో మెకానిక్ లెక్చరర్, పైగా వాళ్ళదీ, మా అమ్మదీ ఒకే
ఊరు, దూరపు చుట్టరికం కూడా ఉన్నట్టుంది. వాడిని నేను మొదటిగా
చూసింది కాలేజీలోనే. వాడు డిప్లొమా మొదటి సంవత్సరం మా కాలేజీలోనే చదివాడు. నా
క్లాస్‌మేట్ కూడా. వాడి పెదాలు ఎర్రగా ఉంటాయి, అందుకని వాడిని
రోజా అని పిలిచేవాడిని. ఇప్పటికీ వాడి ఫోన్ నెంబర్ రోజా పేరుతోనే ఉంటుంది. ఇద్దరం
కలిసి భోజనం చేస్తుండగా, ఏదో మాటల్లో మా
అమ్మ, మా ఫ్రెండ్‌తో, వీడు సిగరెట్స్ కాలుస్తున్నాని
జోకులేస్తున్నాడు చూడు అంది. (నేను ఏ విషయమైనా సరదాగా చెపుతున్నట్టు చెప్పేస్తాను.
ఎవరన్నా అమ్మాయి నచ్చినప్పుడు, మామూలుగా పరిచయం
అయ్యాకా, మాటల్లో నా కోరికను నవ్వుతూ, ఏదో సరదాగా
చెపుతున్నట్టు చెప్పేస్తాను. ఈ పద్ధతి నాకు బాగా పనిచేసింది కూడా). దానికి వాడు
నిజమేనండీ, కాలుస్తున్నాడు అన్నాడు. దానికి మా అమ్మ సాయంత్రం భాజీని
రానివ్వు, నీ సంగతి చెపుతాను అని తిట్టేసింది (మేము మా నాన్నగారిని
భాజీ అని పిలుస్తాము). ఆ సాయంత్రం వాడిని బస్ ఎక్కించి వచ్చేసరికి, నా అదృష్టం కొద్దీ మా నాన్నగారి ఫ్రెండ్ ఉన్నారు. ఆయన ముందు ఏమీ అనలేక, ఏరా సిగరెట్
కాలుస్తున్నావా అని అడిగారు, మానివేసాను అని
చెప్పాను. ఎప్పటి నుండీ అని అడిగారు, మధ్యాహ్నం నుండీ
అని చెప్పాను. దానితో మా నాన్నగారు ఇంకేమీ మాట్లాడలేదు. నేను కూడా కాకినాడలో ఉండగా
మళ్ళీ సంవత్సరంన్నర పాటు సిగరెట్ కాల్చలేదు. ఆ తరువాత మళ్ళీ సిగరెట్
వెలిగించింది, కొత్తగూడెం బస్ జంగారెడ్డిగూడెంలో ఆపినప్పుడే.
కొత్తగూడెం బస్, దారిలో
చండ్రుగొండ, జంగారెడ్డిగూడెం, రాజమండ్రి ల్లో
ఎక్కువ సేపు ఆగుతుంది. మొత్తానికి కాకినాడ వెళ్ళేసరికి అయిపోతాయిలే, అనుకోని సిగరెట్ వెలిగించాను. సగం కాల్చేసరికి బస్సు
వచ్చేసింది. బస్సు ఎక్కి చూస్తే చివరి వరసలో సీట్ ఖాళీగా కనిపించింది. హమ్మయ్య
అనుకొని వెళ్లి కూర్చున్నాను. బస్సు దారిలో చంద్రుగొండ దగ్గర భోజనానికి ఆపాడు.
మద్యాహ్నం చేసిన భోజనం గుర్తుకువచ్చి టిఫిన్ తో సరిపెట్టేసాను. సిగరెట్ పూర్తి
అయ్యేసరికి బస్సు బయలుదేరింది.
రేపు ఉదయం నన్ను కాకినాడలో చూసే సరికి మా వాళ్ళ ఫీలింగ్స్
ఎలా ఉంటాయా అని ఆలోచిస్తూ నిద్ర లోకి జారుకున్నాను.
No comments:
Post a Comment