Total Pageviews

Tuesday, November 23, 2010

MY SINGARENI DAYS - 2

కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్లో, ఈ హోటల్ ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. అప్పటి దాకా ఇంటి భోజనం, అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌తో కలిసి వాళ్ళ మెస్‌లో కానీ, హోటళ్ళో కానీ తినడమే తప్ప, హోటళ్ళో తినడం నాకు అసలు అలవాటు లేదు, ఇష్టం కూడా ఉండదు. జిల్లా పరిషత్‌లో, మా జెఇ పాండురంగారావు గారు బదిలీ అయినప్పుడు కొలీగ్స్ అందరమూ కలిసి హోటళ్ళో పార్టీ ఇచ్చాము. నేను చికెన్ సగం తిని వదిలేసాను. బయటకు వచ్చాకా, మా కొలీగ్ యాభై రూపాయలు బొక్క, తిననని చెపితే నీకు తెప్పించే వాడిని కాదు కదా అని  తిట్టాడు. ఆ, యాభై రూపాయలా, ఆ విషయం ముందే చెప్పుంటే, కుక్కేసుకుందును కదా అని తెగ భాధపడిపోయాను. అప్పటికి నాకు నాన్ వెజ్ అంతగా అలవాటు లేదు. ఎప్పుడన్నా పావుకేజీ మాంసం వండితే, మా ఇద్దరక్కలు, నేను కలిసి దానిని రెండు పూటలు తినేవాళ్ళము. నేను పుట్టిన దగ్గర నుండీ మా పేరెంట్స్ నాన్ వెజ్ తినడం మానివేసారు. (కొడుకులంటే అప్పుడే భయపడేవారన్న మాట). దానితో మాకు నాన్ వెజ్ ఇష్టం ఉండేది కాదు. 


భోజనం చేసి ఆఫీసుకు చేరాము. ఆఫీసులో సాయంత్రం దాకా గడిపి, నేను బస్సు స్టాండ్ కి  బయలుదేరాను. దారిలో ఆగి ఇంకో సిగరెట్ పెట్టి (ఇప్పుడు అయితే డబ్బీ అంటున్నాను) కొన్నాను. అప్పుడు సాయంత్రం 5 .30 అయ్యింది. బస్సు 7 .30 కి. సరే అని చెప్పి అక్కడే అందరిని చూస్తూ తిరుగుతున్నాను. అక్కడి భాష నాకు కొత్తగా వుంది. ఈ లోపు ఒక లంబాడి గ్రూప్ ని చూసాను. వాళ్ళు అక్కడే గుండ్రం గా కూర్చుని ఏడుస్తున్నారు. నేను ఎప్పుడో చిన్నప్పుడు విజయవాడ లో వుండగా లంబాడి వాళ్ళను చూసాను, మరల ఇప్పుడు చూడడమే. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఎవరైనా పోయారేమో అనుకున్నాను. అక్కడ, ఒకరిని ఏమైంది అని అడిగితే, ఆ ఏమి లేదు వాళ్ళల్లో ఎవరైనా వూరు వెళుతుంటే, వాళ్ళు అలాగే ఏడుస్తారు అని చెప్పాడు. అలా  అందరిని చూస్తూ కాలక్షేపం  చేస్తున్నాను. ఇంకా ఎన్ని సిగరెట్స్ ఉన్నాయా అని చూసాను. ఆరు వున్నాయి. పరవాలేదు ఇంటికి వెళ్ళే లోపు కాల్చేయవచ్చు అనుకున్నాను. ఎందుకంటే నేను సిగరెట్స్ మానేసానని మా నాన్న గారికి చెప్పాను.

అది కూడా చాలా విచిత్రంగా జరిగింది. నా ఫ్రెండ్ ఒకడు విశాఖపట్నం నుండి కాకినాడ వచ్చాడు. వాడు, నేను మూడు నెలల తేడాతో వైజాగ్‌లో పక్క, పక్క ఇల్లల్లో పుట్టాము. వాళ్ళ నాన్నగారు కూడా, పాలిటెక్నిక్‌లో మెకానిక్ లెక్చరర్, పైగా వాళ్ళదీ, మా అమ్మదీ ఒకే ఊరు, దూరపు చుట్టరికం కూడా ఉన్నట్టుంది. వాడిని నేను మొదటిగా చూసింది కాలేజీలోనే. వాడు డిప్లొమా మొదటి సంవత్సరం మా కాలేజీలోనే చదివాడు. నా క్లాస్‌మేట్ కూడా. వాడి పెదాలు ఎర్రగా ఉంటాయి, అందుకని వాడిని రోజా అని పిలిచేవాడిని. ఇప్పటికీ వాడి ఫోన్ నెంబర్ రోజా పేరుతోనే ఉంటుంది. ఇద్దరం కలిసి భోజనం చేస్తుండగా, ఏదో మాటల్లో మా అమ్మ, మా ఫ్రెండ్‌తో, వీడు సిగరెట్స్ కాలుస్తున్నాని జోకులేస్తున్నాడు చూడు అంది. (నేను ఏ విషయమైనా సరదాగా చెపుతున్నట్టు చెప్పేస్తాను. ఎవరన్నా అమ్మాయి నచ్చినప్పుడు, మామూలుగా పరిచయం అయ్యాకా, మాటల్లో నా కోరికను నవ్వుతూ, ఏదో సరదాగా చెపుతున్నట్టు చెప్పేస్తాను. ఈ పద్ధతి నాకు బాగా పనిచేసింది కూడా). దానికి వాడు నిజమేనండీ, కాలుస్తున్నాడు అన్నాడు. దానికి మా అమ్మ సాయంత్రం భాజీని రానివ్వు, నీ సంగతి చెపుతాను అని తిట్టేసింది (మేము మా నాన్నగారిని భాజీ అని పిలుస్తాము). ఆ సాయంత్రం వాడిని బస్ ఎక్కించి వచ్చేసరికి, నా అదృష్టం కొద్దీ మా నాన్నగారి ఫ్రెండ్ ఉన్నారు.  ఆయన ముందు ఏమీ అనలేక, ఏరా సిగరెట్ కాలుస్తున్నావా అని అడిగారు, మానివేసాను అని చెప్పాను. ఎప్పటి నుండీ అని అడిగారు, మధ్యాహ్నం నుండీ అని చెప్పాను. దానితో మా నాన్నగారు ఇంకేమీ మాట్లాడలేదు. నేను కూడా కాకినాడలో ఉండగా మళ్ళీ సంవత్సరంన్నర పాటు సిగరెట్ కాల్చలేదు.  ఆ తరువాత మళ్ళీ సిగరెట్ వెలిగించింది, కొత్తగూడెం బస్ జంగారెడ్డిగూడెంలో ఆపినప్పుడే.

 కొత్తగూడెం బస్, దారిలో చండ్రుగొండ, జంగారెడ్డిగూడెం, రాజమండ్రి ల్లో ఎక్కువ సేపు ఆగుతుంది. మొత్తానికి కాకినాడ వెళ్ళేసరికి అయిపోతాయిలే, అనుకోని సిగరెట్ వెలిగించాను. సగం కాల్చేసరికి బస్సు వచ్చేసింది. బస్సు ఎక్కి చూస్తే చివరి వరసలో సీట్ ఖాళీగా కనిపించింది. హమ్మయ్య అనుకొని వెళ్లి కూర్చున్నాను. బస్సు దారిలో చంద్రుగొండ దగ్గర భోజనానికి ఆపాడు. మద్యాహ్నం చేసిన భోజనం గుర్తుకువచ్చి టిఫిన్ తో సరిపెట్టేసాను. సిగరెట్ పూర్తి అయ్యేసరికి బస్సు బయలుదేరింది.


రేపు ఉదయం నన్ను కాకినాడలో చూసే సరికి మా వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయా అని ఆలోచిస్తూ నిద్ర లోకి జారుకున్నాను.


Monday, November 22, 2010

MY SINGARENI DAYS - 1

అసలు ఈ బ్లాగ్ వ్రాస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు. చిన్నప్పటి నుండి నాకు పుస్తకాలు చదవడం బాగా అలవాటు. అందరి లాగే నేనూ, మనం కూడా ఒక పుస్తకం వ్రాయాలి అని అనుకునేవాడిని. సరే మొదలుపెడితే పోలా అని మొదలుపెట్టేసాను. ఓపిక ఉంటే చదవండి. ఈ బ్లాగ్ 2010లో మొదలుపెట్టాను. అప్పుడు చాలా డిప్రషన్‌లో ఉన్నాను. నా ఆవేదనను మరచిపోవడానికి, నేను ఆనందంగా గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ ఇది రాసాను.

1983 ఆగస్ట్ 6 న కొత్తగూడెం బస్ స్టాండ్ లో, ఉదయం 9.30 కి ఇల్లందు నుండి వచ్చిన బస్సు లో నుండి దిగాను. సిగరెట్ పెట్టి కొనుక్కొని బయటకు వచ్చి Singareni హెడ్ ఆఫీసు కి దారి అడిగి, నెమ్మదిగా నడవడం మొదలుపెట్టాను. ఆ రోజు ఉదయమే కాకినాడ నుండి మా చిన్నాన్న ఉంటున్న ఇల్లందు వచ్చి, కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి కొత్తగూడెం వచ్చాను. ఇప్పటిదాకా రెండు ఉద్యోగాలు కాకినాడ లోనే చేసాను. కాకపోతే మొదటినుండి ఉద్యోగం చెయ్యడం నాకు ఇష్టం లేదు. అందుకనే ఈ ప్లాన్ వేసాను. ఎందుకంటే నేను ఒక్కడినే కొడుకుని.నాకు ఇద్దరు అక్కలు. పెద్ద అక్కకు పెళ్లి అయ్యి మండమర్రిలో ఉంటోంది.బావగారు ఇదే Singareni లో  ఏ.ఇ గా చేస్తున్నారు.నేను ఇంత దూరంలో వుంటే, నా గురించి మా అమ్మ బెంగపెట్టుకొని ఉద్యోగం మానిపించేస్తుంది అని ఒక వెదవ ఆలోచన. నడుస్తున్నానన్నమాటే గాని నా ఆలోచనంతా, కాకినాడ ఎప్పుడు వెళ్లుతానా అనే. ఎందుకంటే ఆ ముందు రోజు బస్సు ఎక్కేముందు, మా ఫ్రెండ్ లవర్ దగ్గర మాట తీసుకొన్నాను. నేను ఈ సారి కాకినాడ వచ్చినప్పుడు తను మా ఫ్రెండ్ని పెళ్లి చేసుకొనేది, లేనిది చెప్పాలని.
అప్పుడే రెండు సిగరెట్లు కాల్చేసాను.దూరంగా పెద్ద గేటు కనిపించింది. ఓహో ఇక్కడే అన్నమాట మనం ఉద్యోగం చెయ్యబోయేది అనుకొన్నాను. కొద్దిగా ఎగ్సైట్మెంట్. గేటు దగ్గర సెక్యూరిటీ గార్డ్ వున్నాడు. అక్కడ ఆగి అతన్ని సివిల్ సి.ఇ.ఆఫీసు ఎక్కడ అని అడిగాను. వెనకాల వుంది వెళ్ళమన్నాడు. ముందు పెద్ద బిల్డింగ్. దాని వెనకాల మా సివిల్ ఆఫీసు. లోపల  డి.వై.సి.ఇ.గారి ఆఫీసు లోకి వెళ్లి, నేను కొత్తగా జాయిన్ అవ్వడానికి వచ్చిన ఓవర్సీర్ ని అని చెప్పి ఎవరి  దగ్గర రిపోర్ట్ చెయ్యాలి అని అడిగా. ఈలోగానే నా కళ్ళు అక్కడ ఎవరైనా అమ్మాయిలు వున్నరేమోనని స్కాన్ చేసేసాయి. వాళ్ళు డి.వై.సి.ఇ గారి రూము చూపించారు. అప్పుడు శ్రీ.వెంకట రత్నం గారు మాకు డి.వై.సి ఇ.గా చేస్తున్నారు. ఈ లోపు అక్కడే నాలా కొత్తగా జాయిన్ అవ్వడానికి, వరంగల్ నుండి వచ్చిన ఉపేంద్ర కలిసాడు.ఇద్దరం వెళ్లి  డి.వై.సి.ఇ గార్ని కలిసాము. నా జీవితంలో నేను కలిసిన గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఆయన మా గురించి అన్ని విషయాలు అడిగి, మీరు ఇప్పుడు చిన్నవాళ్ళు, ఈ ఫీల్డ్ లో వ్యసనాలు తొందరగా అలవాటు అవుతాయి, వాటి జోలికి వెళ్ళకండి అని చెప్పారు. నేను అప్పుడే రెండు సిగరెట్లు కాల్చి వచ్చానేమో, ఆయనకు ఎక్కడ వాసన వస్తుందో అని కంగారుపడ్డాను. ఈ లోగా ఆయనే, సరే ఒక రెండు రోజులు ఇక్కడకే రండి, మీరు ఎక్కడ చేయాలో అప్పుడు చెబుతాను అన్నారు. హమ్మయ్య అనుకోని బయటకు వచ్చాము. నా కళ్ళు వెంటనే వాటి పని అవి చెయ్యడం మొదలు పెట్టేయి. ఒక అమ్మాయి కనిపించింది. పరవాలేదు కలర్ ఉందిలే అనుకొన్నాను. ఎందుకంటే మా కాలేజీ లో అమ్మాయిలు వుండేవారు కాదు. నేత్రానందం కోసం కాకినాడ అండాలమ్మ కాలేజీ కి వెళ్ళవలసి వచ్చేది. జాబు చూస్తే ఫీల్డ్ వర్క్. మరీ బోర్ గా వుండేది. ఇక్కడా అలాగే ఉంటుందేమో అని నా భయం. ఓ.కే. పరవాలేదు అనుకొన్నాను.
ఇద్దరం రూము లో నుండి బయటకు వచ్చి, అక్కడే వున్న కంపెనీ కాంటీన్ లోకి వెళ్ళాము. రెండు టీలు చెప్పి(అప్పటికింకా చ్చాయ్ అనడం తెలియదు) ఎంత అన్నాను, అతను 20 పైసలు అన్నాడు. నాకు అర్థం కాలేదు. ఎంత అని మళ్ళీ అడిగాను.అతను విసుగ్గా మొహం పెట్టి చాయ్ 10 పైసలు అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చాయ్ తాగి బయటకు వచ్చి సిగరెట్ ముట్టించాను. ఈ రోజు శనివారం, రేపు ఆఫీసు వుండదు.మళ్ళీ ఇల్లందు ఎందుకు, ఇటు నుండి కాకినాడ వెళ్ళిపోదాము అని నిర్ణయం తీసుకొన్నాను. నేను ఇల్లందు నుండి వచ్చేటప్పుడే, మా పిన్ని కి వెళితే నేను అటు నుండి కాకినాడ వెళతాను అని చెప్పి వచ్చాను. తరువాత ఇద్దరం ఒకరి గురించి ఒకరం అడిగి తెలుసుకున్నాము.అతను అంతకు ముందు రైల్వేలో చేసాను అని చెప్పాడు. నేను అప్పటికి ఫిషరీస్ కార్పోరేషన్, జిల్లా పరిషత్ ల్లో చేసి వున్నాను. అదేమిటి అందులో ఎందుకు మానేశారు అని అడిగాడు. అక్కడ నేను వర్క్ ఇన్స్పెక్టర్ని, ఇక్కడ సూపెర్వైజర్ కాడర్ కదా అన్నాను. అలా మాట్లాడు కుంటూ, ఇద్దరం పోస్ట్ ఆఫీసు సెంటర్ కి వచ్చాము. అప్పటికి 1 .00 అయ్యింది. ఇద్దరం కలసి భోజనం చేసాము.నా జీవితంలో అటువంటి భోజనం అదే మొదటిసారి.ఖర్మ మొదలైందిరా బాబూ  అనుకొన్నాను.